శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి ఉగాది ఉత్సవాలు.. అభిషేకాలు, కుంకుమపూజలు రద్దు

శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయంలో స్వామి అమ్మవార్ల అభిషేకాలు, కుంకుమార్చన పూజలు నేటి నుంచే నిలిపివేశారు. ఇవాళ్టి నుంచి స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాలు, స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలకు విడతలవారీగా భక్తులను అనుమతించనున్నారు. రోజుకు నాలుగు విడతలుగా ఏప్రిల్ 5 వరకు భక్తులకు అనుమతి లభించనుంది. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలం ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనాలు. విఐపి బ్రేక్ దర్శనాలు కూడా దేవస్థానం రద్దు చేసింది. భక్తులందరికీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి లభించనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి దర్శనం వేళల్లో దేవస్థానం మార్పులు చేసింది.

శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో పెద్దిరాజు పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీలను లెక్కించారు. 16 రోజుల్లో కోటి 81 లక్షల 13 వేల రూపాయల మేర భక్తులు కానుకలను సమర్పించారు. దీనికి విదేశీ కరెన్సీ కూడా భారీగానే సమకూరింది. ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ ప్రక్రియంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శివ సేవకులు పాల్గొన్నారు.

Share this post with your friends