శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో

శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన ఈవో దంపతులకు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టి. బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం టిటిడి ఈవో దంపతులు వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.

పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా..

వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందన్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తుల సంఖ్య కూడా విశేషంగా పెరగుతోందని ఆయన తెలిపారు. తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేస్తున్న భ‌క్తులు ప‌రిస‌ర ప్రాంత ఆల‌యాల సంద‌ర్శ‌న‌లో భాగంగా శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యాన్ని కూడా ద‌ర్శించుకుంటున్నారని, భక్తులకు అవసరమైన సదుపాయాలను తిరుపతిలో టీటీడీ కల్పించిందన్నారు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి ప్రసిద్ధి చెందిందన్నారు. శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ, చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీవేంకటేశ్వరుడు పట్టువస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి, అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కాళహస్తీశ్వరుడికి గత 25 సంవత్సరాలుగా టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

Share this post with your friends