ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవ అంకురార్పణం.. ఏం చేస్తారంటే..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకూ జరగనున్న దృష్ట్యా, అక్టోబ‌రు 03 రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కూ శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు.

అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. సాధారణంగా సాయంత్రం వేళలో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు. సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి.ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి అన్నది నమ్మకం. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు నాంది పలికినట్లు అవుతుంది.

Share this post with your friends