
జనవరి 2025లో ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు సిద్ధమవుతోంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద మతపరమైన ఉత్సవం. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల భద్రత, పరిశుభ్రత వంటి సౌకర్యాలపై దృష్టి సారిస్తోంది యోగి ప్రభుత్వం. అయితే కుంభమేళాలో వినూత్న కార్యక్రమానికి యోగి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మహా కుంభ మేళా వైభవాన్ని, దివ్యత్వాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం భక్తులపై ఆకాశం నుంచి పూల వర్షం కురిపించే విధంగా ప్రణాళికలు సృష్టిస్తోంది. గతంలోనూ పలు సందర్భాల్లో యోగి ప్రభుత్వం ఇలా భక్తులపై పూల వర్షం కురిపించింది. ఇప్పుడు మహాకుంభమేళాలోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించనుంది.
ఈసారి మహా కుంభ మేళాకి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 40 కోట్ల మంది రావచ్చని భావిస్తోంది. ఈ క్రమంలోనే సంగంతో పాటు ఇతర ప్రధాన ఘాట్‌లలో పూల వర్షం కురిసేలా ప్లాన్ చేస్తున్నారు. 2021లో జరిగిన కుంభమేళాలో మౌని అమావాస్య రోజున సంగం ఒడ్డున కోట్లాది మంది భక్తులపై పూల వర్షం కురిపించారు. ఇదే సంప్రదాయాన్ని మహా కుంభమేళాలో సైతం కొనసాగించాలని భావిస్తున్నారు. అప్పట్లో #UPMePhoolVarsha హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయ్యింది.
