
రాములవారి కల్యాణానికి గోటి తలంబ్రాలను అందజేస్తారని తెలిసిందే. స్వామివారి కోసం వలిచే గోటి తలంబ్రాలకు సంబంధించిన పంట కోతకు వచ్చింది. దీనికోసం దేవతలంతా దిగి వచ్చారు. కోటి తలంబ్రాల మహాయజ్ఞానికి 14వ సారి రామలక్ష్మణ, హనుమంత సమేత వానర వేషధారణలో వరి పంట కోత కోశారు. సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో కోటి తలంబ్రాల మహా యజ్ఞ పంట కోతలో పాల్గొన్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం అచ్చుతాపురంలోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో 14వ సారి రాములోరి కళ్యాణానికి వరి కోతను చేపట్టారు.
ఉదయాన్నే ముందుగా రాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంటను కోసి దానిని ఒకచోటకు చేరుస్తారు. ధాన్యాన్ని వలిచి రాములోరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పిస్తారు. రాములోరి కళ్యాణానికి వేసే వరిపంటకు ఎలాంటి పురుగుల మందులు వాడరు. సహజసిద్ధంగా పండించిన పంటను మాత్రమే వాడుతారు. రాములోరి కళ్యాణానికి పంపించే కోటి తలంబ్రాలు మహా యజ్ఞంలో పాల్గొన్నందుకు రాజమహేంద్రవరానికి చెందిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 14 ఏళ్లుగా రాముల వారి కరుణతో గోటి తలంబ్రాలను వలిచి కల్యాణానికి పంపిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
