
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 17న అంకురార్పణ జరుగనుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 17న అంకురార్పణ చేయనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 26వ తేదీ వరకూ జరగనున్నాయి. దీని కోసం ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంకురార్పణ సందర్భంగా 17న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 18న ధ్వజారోహణం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 18న ఉదయం 8.15 నుంచి 8.40 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం, సాయంత్రం స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం 8 గం.ల నుండి 9 గం.ల వరకు, రాత్రి 7 – 8 గం.ల వరకు స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
