
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మూడవ రోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
ఈ తెప్పోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అడుగడునా స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, సూపరిండెంట్ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
