శేష వాహనంపై కామాక్షి సమేత సోమస్కందమూర్తిగా కపిలేశ్వరుడు..

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వరస్వామి వారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అదికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends