కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను ( మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు.
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ మరియు వేద విశ్వవిద్యాలయంచే సంరక్షిస్తూ డిటిలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ సందర్శించారు. ముందుగా విశ్వవిద్యాలయంచే సంరక్షింపబడుతున్న వేద, వేదాంగా, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ మరియు దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను మరియు వాటి ప్రచురణను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయన్నారు. ఇక్కడ ఉన్న పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు, పురాతన న్యాయ శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివరించినట్లు తెలిపారు. ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశ వ్యాప్తంగా చేయాలన్నారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారత దేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయని నేను దృఢంగా నమ్ముతున్నాని చెప్పారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపటం, అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిదని, వేదమంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆచార్య రాధేశ్యాం, ఆచార్య రాధా గోవింద త్రిపాఠి, ఆచార్య సుబ్రహ్మణ్య శర్మ, తాళపత్ర సంరక్షకురాలు శ్రీమతి విజయలక్ష్మి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అంతకుముందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌కు టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గౌ|| ప్రధాన న్యాయమూర్తులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, ఆగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.