సింహాద్రి అప్పన్న దేవాలయంలో నారసింహ మహా యజ్ఞం కొనసాగుతోంది. ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు నృసింహ, సుదర్శన మంత్ర పఠనం జరిగింది. తొలుత అర్చకులు దేవేరుల సమేతుడైన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరువీధిగా యాగశాల ప్రవేశం చేయించారు. ఆలయ స్థానాచార్యులు సింహాద్రినాథుడి మహత్యాన్ని ప్రవచనం చేస్తుండగా అర్చకులు ఉభయదాతలతో సంకల్పం చేయించి కంకణధారణ జరిపించారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ యాగ ద్రవ్యాలను హోమగుండాల్లో సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చేయించి పాంచరాత్రాగమ విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.