
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై సన్వామివారికి అడుగడుగునా కర్పూర హారతులిచ్చారు. వాహనసేవ ఆలయం నుంచి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ ఎస్వీ సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల అధ్యాపకులు శ్రీమతి శైలజ బృందం మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే శివనామ సంకీర్తనల గానం అధ్బుతంగా జరిగింది. ఇందులో శంకర శశిధర…., తిరువీధుల మెరసి దేవదేవుడు….., గజవదన బెడువే…. తదితర భజన సాంప్రదాయ సంకీర్తనలు గానంచేసి భక్తులను అలరించారు. అనంతరం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభావతి బృందం భరతనాట్యం ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది.
