
పవిత్రమైన కార్తీక మాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజూ ముఖ్యమైనది. కాగా.. కార్తీక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 11 నుంచి మనగుడి కార్యక్రమం జరగునుంది. ఈ కార్యక్రమాన్ని 17వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం జరుగనుంది. ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తారు. ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవం కార్యక్రమం చేపడతారు.
