రేపటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు

అక్టోబరు 3 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు దసరా పర్వదినం వరకూ అంటే ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7:45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం సేవను ర‌ద్దు చేయనున్నారు. అదేవిధంగా, అక్టోబరు 4, 11వ తేదీలలో ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 12న ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది.

Share this post with your friends