ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 5 నుండి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ మరమ్మత్తు పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు.
మాహా సంప్రోక్షణ సందర్భంగా మార్చి 6వ తేదీ ఉదయం 7.30 గంటలకు భగవత్పుణ్యాహము, అగ్ని మధనము, యాగశాలలో వైధిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ. చక్రబ్జా మండల, పరివార కుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హవన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, సహస్ర కళాశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి సాత్తుమొర జరగనుంది.
మార్చి 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు సహస్ర కలశావాహన, రామ తారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమములు, విమాన గోపురం ఛాయా స్నపనము, పరివార హోమములు, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనము, మూర్తి హోమం జరుగనుంది.
మార్చి 8న శనివారం ఉదయం 6 గంటలకు చతుస్థానార్చనము, శ్రీమద్రామాయణ యజ్ఞం, మూర్తి హోమం, సహస్రకలశాది దేవత హోమం, సహస్ర కలశాభిషేకం, పూర్ణాహుతి జరుగునుంది. సాయంత్రం 6 గంటలకు కళాపకర్షణ, శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, తత్వన్యాస హోమములు, వేదాది పారాయణం, అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం నిర్వహించనున్నారు.
మార్చి 9 ఆదివారం భగవత్పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీ మద్రామాయణ హోమం, పంచసూక్త – పవమాన హోమములు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు మహా పూర్ణాహుతి, ఉదయం 10 15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్షణ మరియు మహా కుంభాభిషేకము, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.