
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు.
అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సప్త వాహనల్లో సిరులతల్లి అభయం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మవారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అమ్మవారిని విశేషంగా అభిషేకించారు. సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారు చంద్రప్రభ, గజ వాహనంపై దర్శనమివ్వనున్నారు.
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల బృందాల కోలాటాలు, చెక్కభజనలు, భక్తులను ఆకట్టుకున్నాయి.
