శ్రీకాళహస్తిలో లేడీ అఘోరీ హంగామా..

లేడీ అఘోరీ తెలంగాణలో పుణ్యక్షేత్రాలను దర్శించుకుని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లింది. అక్కడ ఇవాళ శ్రీకాళహస్తిని దర్శించుకుంది. వస్త్రాలు లేకుండా ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా దేవస్థానం సిబ్బంది ఆమెను అడ్డుకుంది. అయినా సరే.. దర్శనానికి వెళ్లేందుకు లేడీ అఘోరీ యత్నించగా ఆలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనను ఆలయం లోపలకు వెళ్లనివ్వకపోవడంతో అఘోరీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్ మూత తీసి తనపై.. అలాగే కారుపై పోసి ఆత్మహత్య చేసుకుంటానంటా హంగామా సృష్టించింది. మరోవైపు అఘోరీ ఆశీస్సుల కోసం భక్తులు, స్థానికులు ఆరాటపడటం గమనార్హం.

ఆలయం రెండో గోపురం నుంచి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని ఆమెపై నీళ్లు పోశారు. స్వామి దర్శనం చేసుకున్న తరువాతే తిరిగి వెళతానంటూ ఆలయం ఎదుట బైఠాయించే ప్రయత్నం లేడీ అఘోరీ చేసింది. అంబులెన్స్‌లో పోలీసులు ఆమెను శ్రీకాళహస్తిలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆమె శరీరంపై పెట్రోల్‌ కారణంగా ఇబ్బంది లేకుండా వైద్యం చేయించారు. ఆపై శ్రీకాళహస్తి దాటించే ప్రయత్నం చేశారు. వెళ్లిపోయిందని పోలీసులు ఊపిరి పీల్చుకునేలోపు తిరిగి లేడీ అఘోరి శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్రత్యక్షమైంది. బట్టలు ధరించి వస్తే తప్ప దర్శనానికి అనుమతించబోమని ఆలయ అధికారులు తేల్చి చెప్పడంతో ఎట్టకేలకు ఎర్రని వస్త్రం కప్పుకుని కపాల మాలలు తీసేసి లేడీ అఘోరీ స్వామివారి దర్శనం చేసుకుంది.

Share this post with your friends