తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 4న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం వైభవంగా జ‌రిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల మధ్య కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేపడుతారు.

8 పరదాలు అమ్మవారికి బహుకరణ:

హైదరాబాద్ కు చెందిన శ్రీ వెంకట రామ ప్రసాద్ శర్మ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 8 పరదాలను బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు శ్రీ బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.

Share this post with your friends