
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం ఆచార్య రుత్విక్ వరణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్రసమర్పణ చేస్తారు. సాయంత్రం ఆలయ విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వహించి, ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 3న ఉదయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 4న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 5న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
