దేవతలకే కాదు రాక్షస సంతతికి చెందిన హిడింబికి గుడి.. ఈ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వారికి పెళ్లవుతుందట..

దేవతలకు దేవాలయాలు ఉండటం తెలుసు కానీ రాక్షసులకు ఆలయం ఉండడం మీరెప్పుడైనా చూశారా? హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలీలో ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడ పూజలందుకునేది ఎవరో తెలుసా? భారతంలో ఘటోత్కచునికి తల్లి.. భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబి. ఏటా వేలాది మంది భక్తులు హిడింబిని దర్శించుకుంటారు.

పురాణ ఇతిహాసాల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు హిడింబి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహాభారతంలో హిడింబిది ప్రత్యేకపాత్ర. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఒక గుహలోకి వెళతారు. అక్కడ మిగిలినవాళ్లు పడుకుంటే.. భీముడు వారికి కాపలాగా ఉంటాడు. అయితే ఈ ప్రాంతంలో ఉండే హిడింబాసురుడు అనే రాక్షసుడు నరవాసన పసిగట్టి.. వాళ్ల వివరాలు కనుక్కోమని అతని చెల్లెలు హిడింబను పంపిస్తాడు.

రాత్రివేళ కాపలా ఉన్న భీముడిని చూసి.. ప్రేమలో పడుతుంది హిడింబి. తన అన్నతో ప్రమాదం పొంచి ఉందని భీముడిని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత భీముడితో జరిగిన యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు. అయితే భీముడితో ప్రేమలో ఉన్న విషయాన్ని కుంతిదేవికి చెప్పి పెళ్లి చేయమని వేడుకుంటుంది హిడింబి. కుంతి అంగీకారంతో హిడింబి, భీముడు పెళ్లి చేసుకుని కొద్దిరోజులు అక్కడే ఉంటారు. వీరికి ఘటోత్కచుడు జన్మిస్తాడు. పాండవులు వెళ్లిపోయిన తర్వాత ఘటోత్కచుడిని పెంచి పెద్దవాడిని చేస్తుంది. ఘటోత్కచుడు రాజ్యపాలన తీసుకున్న తర్వాత హిడింబి హిమాలయాలకు వెళ్లిపోతుంది. అక్కడే తప్పసు చేసి.. కోరికలు తీర్చే దేవతగా మారుతుంది.

ఆమె తపస్సు చేసిన ప్రాంతంలోనే మహారాజా బహదూర్‌ సింగ్‌ క్రీ.శ 1553లో హిడించా పేరుతో నాలుగు అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించాడని ప్రసిద్ధి. దట్టమైన అడవిలో దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఆలయంలో అగ్నిహోత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. కొన్ని రోజులు మినహా ఏడాదంతా ఈ ఆలయంలో మంచు పేరుకుని ఉంటుంది. దీని ఎత్తు 24 మీటర్లు ఉంటే.. ఆలయంలో హిడింబి మాత విగ్రహం మాత్రం కేవలం మూడు అంగులాలే ఉండటం విశేషం. ఇక్కడ ఆమె పాదముద్రలు కూడా ఉంటాయి. ఈ గుడికి కొంత దూరంలో ఘటోత్కచుడి ఆలయం కూడా ఉంటుంది.

ఇక్కడి ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా హిడింబి మాతకు పూజలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని కోరుకుంటే ఈ దేవత అనుగ్రహిస్తుందని కూడా ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. ఏడాదికి ఒకసారి హిడింబి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ దుంగ్రీ మేళా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హిడింబి ఆలయంలో మేకలు,దున్నలు, జింకలు సహా జంతువుల అవశేషాలే కనిపిస్తాయి. జంతువులను బలివ్వడం ఇక్కడి ఆచారం.

మనాలీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిడింబి ఆలయం ఉంటుంది. మనాలీకి వెళ్లే పర్యాటకులు తప్పకుండా హిడింబి మాతను దర్శించుకుంటారు. ఆలయం పక్కనే ప్రవహించే నీళ్లలో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయిని కూడా నమ్మకం. ఈ ఆలయాన్ని దుంగ్రీ మందిర్‌ అని స్థానికంగా పిలుస్తుంటారు. హిడింబి దేవిని హిర్మా దేవి అని కూడా పిలుస్తారు. హిడింబిని ఆటవిక జాతులవారికి ప్రతీకగా పూజిస్తారు. నవరాత్రి సమయంలో భక్తులు అన్ని చోట్ల దుర్గాదేవిని ఆరాదిస్తే, మనాలి ప్రాంతంలో హిడింబిమాతాను ఆరాధిస్తుంటారు.

Share this post with your friends