వేములవాడ రాజన్నకు కల్యాణోత్సవాలు

వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దివ్యకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజున నిర్వహించిన దివ్య రథోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ సందర్బంగా స్వామి, అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ స్థాన చార్యులు భీమశంకర్ శర్మ అధ్యర్యంలో అర్చకులు రథ ప్రతిష్ట, రథ హోమం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా రంగు రంగుల పూలు, విద్యుద్దీపాలతో రథాన్ని అలంకరించారు. అనంతరం రథంపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ ఉత్సవ మూర్తులను కొలువుతీర్చి పూజలు నిర్వహించారు. మహిళలు మంగళ హరతులతో రథానికి ఘనంగా స్వాగతం పలికారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు త్రిశూల యాత్ర వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల నడుమ యాగశాలలో పూర్ణాహుతి జరిగింది. నాగిరెడ్డి మండపంలో నాకబలి, ధర్మగుండంలో త్రిశూల యాత్రను అర్చకులు గావించారు.

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దుచేసి భక్తులను లఘు దర్శనానికి అనుమతించారు.

Share this post with your friends