నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి శ్రీపొలేరమ్మ అమ్మవారి జాతర పనులు ప్రారంభమయ్యాయి. నేడు శ్రీపొలేరమ్మ జాతరకు అమ్మవారి సేవకులు తొలి చాటింపు వేయనున్నారు. రాజాల సంస్థానంలో రాజల వారి అనుమతులతో అమ్మవారి తాంబూలం కార్యక్రమం జరగనుంది. 18వ తేదీన శ్రీపొలేరమ్మ జాతర రెండో చాటింపు వేయనున్నారు. ఇక పోలేరమ్మ అమ్మవారి జాతరలో భాగంగా 22వ తేదీన ఘటోత్సవం జరగనుంది. 25వ తేదీన అమ్మవారి ఉత్సవం నిర్వహించనున్నారు. 26వ తేదీన శ్రీపొలేరమ్మ అమ్మవారి జాతర, ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. దీంతో పోలేరమ్మ జాతర పూర్తి కానుంది.
వెంకటగిరిలో పోలేరమ్మ జాతరను ప్రతి సంవత్సరం భాద్రపదమాస వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు నిర్వహిస్తారు. పోలేరమ్మ జాతర పూర్వం రాజుల కాలం నుంచి కూడా జరుగుతూ వస్తోంది. 1917వ సంవత్సరంలో వెంకటగిరి సంస్థానంలో చాలా మంది ప్రజలు కలరా, మశూచి వ్యాధుల బారిన పడ్డారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారు. ప్రజలను కాపాడేందుకు వెంకటగిరి రాజవంశస్థులు కలరా వ్యాధి తగ్గడం కోసం ఒక యాగం చేశారు. అప్పుడు కలరా వ్యాధి తగ్గింది. 1919 లో కలరా వ్యాధి తగ్గిన కారణంగా ఘనంగా జాతర నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి ఏటా జాతర నిర్వహిస్తున్నారు.