
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు.
తిరుచానూరు శ్రీ ద్మావతి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 4.20 గంటల నుండి ఆలయ మాడ వీధుల్లో ఈ ఉత్సవం జరిగింది. కాంతులీనుతున్న స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ, వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు.
