చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ‌, కుంభారాధన, హోమం, ల‌ఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9.30 గంట‌ల నుండి యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు.

అనంతరం మూలవర్లకు, ఉత్స‌వ‌ర్ల‌కు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5.30 రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరిండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ హ‌రి, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends