టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టగానే బ్రహ్మోత్సవాలపై ఫోకస్..

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టినశ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతనుకాపాడుకుంటూ, భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రిగారు సూచించారన్నారు.

అదే విధంగా, టీటీడీ చైర్మన్ నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్, బోర్డు మెంబర్స్, డయల్ యువర్ ఈవో, ఐవిఆర్ఎస్, వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ, సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకుని ఇంకా మెరుగైన సేవలను అందించే అంశంపై దృష్టి పెట్టాలనికోరారు. అదేవిధంగా, వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. టీటీడీలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు. ఉదయం కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టీటీడీలో అందుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే, భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలుచాలా రుచికరంగా, నాణ్యంగా ఉన్నట్లు భక్తులు చెప్పారన్నారు. తక్షణం చేపట్టే అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. భక్తులకు అందించేసేవలతోపాటు, విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీసుకుని భక్తులకు వేగంగా, నాణ్యంగా సేవలు అందిద్దామన్నారు.

Share this post with your friends