భద్రాద్రిలో నవమి ఉత్సవాలు ఆలస్యానికి ఈఓనే కారణం: అర్చకులు

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవం శ్రీరామ నవమి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందు పాల్గుణ పౌర్ణమి నాడు అంకురార్పణ, వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి అవి ఆలస్యంగా జరిగాయి. దీనికి ఆలయ అర్చకులు క్లారిటీ ఇచ్చారు. ఆలయ స్థానాచార్యులు స్థల సాయి, ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, అర్చకులు రామ స్వరూప్, మురళీ దీనిపై స్పందించారు. ఉత్సవాలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి తాము కారణం కాదని.. ఆలయ ఈఓ ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమే కారణమని తెలిపారు. అర్చకుల కమిటీ ఆధ్వర్యంలో తాజాగా వీడియో విడుదల చేశారు.

ఆలయంలో జరిగే ఉత్సవాలు నిర్వహించడానికి ముందుగానే ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్‌లను నిర్ణయిస్తామన్నారు. ఈ రుత్విక్కులు లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వరకూ వారే ముందుండి ప్రతి ఉత్సవం జరిపిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఆచార్యగా ప్రధాన అర్చకులు విజయ రాఘవన్, బ్రహ్మగా ఉప ప్రధాన అర్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం వ్యవహారిస్తున్నారని తెలిపారు. అయితే
కొన్ని పరిపాలనాపరమైన కారణాలతో శ్రీనివాస రామానుజంను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్ణశాల ఆలయానికి మార్చి 9న బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి శ్రీనివాస రామానుజం 10వ తేదీన జాయినింగ్ లేఖతో పాటు తాను భద్రాద్రి రామాలయంలో జరిగే ఉత్సవాలకు బ్రహ్మగా ఉన్నందున తనకు అంకురార్పణ, వసంతోత్సవం, డోలోత్సవం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనే అనుమతి ఇవ్వాలని కోరారన్నారు. ఈఓ పర్మిషన్ ఇవ్వకపోవడంతో బ్రహ్మ లేకుండా ఉత్సవాలు నిర్వహించడం వీలుకాదని తెలిపినా ఈఓ స్పదించలేదన్నారు.

చివరకు తామంతా కలిసి 13వ తేదీ అంకురార్పణ రోజు సాయంత్రం ఒక లేఖను ఈఓకి అందజేసినా ఆయన అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఈ ఓ సరైన సమయంలో నిర్ణయం తీసుకోక పోవడం కారణంగానే సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన అంకురార్పణ రాత్రి 9 గంటలకు ప్రారంభం అయిందని.. దీనిలో తమ తప్పేమీ లేదని అర్చకులు తెలిపారు.

Share this post with your friends