శ్రీ వనదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగనీయవద్దు

వేసవి కాలం.. ఎండలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత దర్శనానికి వచ్చే భక్తుల కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎండ వల్ల ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాజాగా ఆయన ఏడుపాయల అమ్మవారి ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.

వేసవి కాలంలో ఎండ నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకుగాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకూ చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. దేవాలయ ప్రాంగణమంతా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి సైతం అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవిలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్వచ్ఛమైన తాగునీరు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చలువ పందిళ్లను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Share this post with your friends