సిరిమానోత్సవానికి తేదీలు ఫిక్స్..

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి వేళవుతోంది. ఈ క్రమంలోనే ఉత్సవ తేదీలను దేవాదాయశాఖ ఖరారు చేసింది. సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 6న ఈ ఉత్సవం ప్రారంభమై.. 14న జరిగే తెప్పోత్సవంతో జాతర ముగుస్తుంది. అక్టోబర్‌ 6న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం, 7న సిరిమానోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది.

పైడితల్లి అమ్మవారిని విజయనగరం ప్రాంత ప్రజలు తమ కులదేవతగా భావించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక సిరిమానోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతూ ఉంటారు. విజయనగరంలో జరిగే అతి ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒకటి. ఈ ఉత్సవంలో భాగంగా సిరిమాను అనే ఒక పెద్ద చెట్టును ఊరేగిస్తారు. దీనికి ముందు పూజారి కలలో పైడిమాంబ అమ్మవారు కనిపించి ఆ చెట్టు ఎక్కడ ఉందో చెబుతుందట. ఆ తరువాత పూజారి కొందరు పెద్దలతో కలిసి వెళ్లి దానిని నరికేసి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు.

Share this post with your friends