తిరుమలలో వైభవంగా రథసప్తమి : చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప అభయం

 సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

చిన్నశేషవాహనం(ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గ‌రుడ వాహనం(ఉదయం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు)

శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు)

శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్ ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు.

Share this post with your friends