గంగమ్మ ఒడి చేరిన ప్రపంచంలోనే కాస్ట్లీ గణపతి..

గణపతి నవరాత్రి ఉత్సవాల సంగతేమో కానీ బీమా కంపెనీలకు మాత్రం పండుగ వచ్చింది. ఎందుకంటే కొన్ని చోట్ల వినాయకులకు నిర్వాహకులు కోట్లలో బీమా చేయిస్తున్నారు. ఓ గణపతికి ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారు. ఆ కథేంటో చూద్దాం. ముంబైలో వినాయకచవితి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ముంబైలోని గౌరు సరస్వతి బ్రాహ్మణ సేవా మండల్ కి చెందిన గణపతి మండపం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి కింగ్ సర్కిల్ వద్ద మండపంలో ముంబైలోని అత్యంత ధనిక గణపతి కొలువుదీరాడు. ఈ వినాయకుడికి గౌడ్ సారస్వత బ్రాహ్మణ సేవా మండలం 400.58 కోట్ల రూపాయల బీమా చేయించింది. ఈ వినాయకుడి నిమజ్జనం కూడా నిన్న పూర్తైంది.

వాస్తవానికి ముంబై మొత్తమ్మీద 2 వేల గణేష్ ఉత్సవ కమిటీలున్నాయి. వీటిలో చాలా మండపాలకు బీమా చేయిస్తూ ఉంటారు. కారణమేంటంటే.. బంగారు ఆభరణాలతో వినాయకుడిని అలంకరిస్తారు. అలాగే మండపాల సెట్టింగ్ కూడా భారీగానే ఉంటుంది. ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఇబ్బంది లేకుండా ఉంటుందని బీమా చేయిస్తారు. ముంబైలోని గణపయ్య 66 కిలోల బంగారం, దాదాపు 330 కిలోల వెండి నగలు, బంగారు కిరీటంతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా కీర్తి గడించాడు. మరి కొన్ని కోట్ల విలువైన వినాయకుడికి బీమా ఉండవద్దా? 400.58 కోట్ల రూపాయల బీమా చేయించారు. ఈ వినాయకుడిని పెట్టిన నాటి నుంచి వార్తల్లో నిలిచాడు. నిన్న గంగమ్మ ఒడికి చేరాడు.

Share this post with your friends