భద్రాద్రి రామయ్య కల్యాణం పనులు ప్రారంభం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణానికి పనులను లాంచనంగా ప్రారంభించారు. హొలీ పౌర్ణమి పురస్కరించుకుని ఈసారి కూడా ఉత్తర ద్వారo వద్ద మహిళలంతా పసుపు కొట్టారు. వైదిక బృందం సతీమణులు పసుపుకొమ్ములు దంచి పసుపును తయారు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ తలంబ్రాల తయారీకి శ్రీకారం చుట్టారు. తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో ఆలయ అర్చకులతో పాటు ముత్తైదువ మహిళలు సైతం పాల్గొన్నారు. అత్తర్,గులాల్,బుక్క,పసుపు,కుంకుమ,పన్నీర్ వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు.

ఏ కల్యాణంలో అయినా వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి. కానీ భద్రాద్రి రామయ్య కల్యాణానికి వాడే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. కాగా.. శ్రీరామనవమి నేపథ్యంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకూ ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం, ఎప్రిల్ 7న రామయ్యకు పట్టాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయితే సీతారాముల కల్యాణంలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న తలంబ్రాలు కలిపే ఘట్టం శుక్రవారం నిర్వహించారు.

Share this post with your friends