![]()
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి . ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ కన్నుల పండువగా అధ్యయనోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం బలరామావతారంలో ముస్తాబై భక్తులకు రామయ్య దర్శనమిచ్చారు. ముందుగా బలరామావతార రూపంలో ఉన్న రామయ్య తండ్రిని ఆలయ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు.
అనంతరం వివిధ రకాల వేషధారణలు,డప్పు వాయిద్యాలు, వేదమంత్రాలు నడుమ స్వామివారిని ఊరేగింపుగా అర్చకులు, ఆలయ అధికారులు మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బలరామావతారం విశిష్టత ఏంటంటే.. శ్రీహరికి శయనమైన ఆదిశేషుని అంశతో జన్మించిన వాడు కావడంతో పాటు నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచాడు. కన్నయ్యకు ధర్మ సంస్థాపనలో సహకరించిన వాడు బలరాముడు. బలరాముడిని సంకర్షనుడు అని కూడా పిలుస్తారు. బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించినవారికి మాందీగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం.
