పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఊంజల్‌సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరిలు పులకించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహస్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం శ్రీవారి అనుగ్రహం అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్తనలను జన బహుళయంలోకి తీసుకువెళ్లడానికి మరింత మంది యువ కళాకారులు కృషి చేయాలని స్వామీజీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్వామీజీకి గరుడ పురాణం 1 మరియు 2 పుస్తక ప్రసాదాన్ని ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అందించారు. తరువాత స్వామీజీకి శ్రీవారి ప్రసాదాలు ఈవో అందజేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవాలను తిరుమలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో భాగంగా ”దినము ద్వాదశి నేడు…, భావములోన బాహ్యము నందును…., బ్రహ్మ కడిగిన పాదము…, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన…., పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…., నారాయణతే నమో నమో…., ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు….,” కీర్తనలను కళాకారులు రసరమ్యంగా గానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టేట్ అధికారి శ్రీ మల్లికార్జున, హెల్త్ అధికారి డా.శ్రీదేవి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఏవిఎస్ఓలు శ్రీ మనోహర్, శ్రీ విశ్వనాథ్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.