భక్తులకు సూచన.. అయోధ్య రామమందిర ట్రస్ట్‌ కీలక నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం మహాకుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో అయోధ్యకు సైతం పర్యాటకుల తాకిడి పెరిగింది. మహాకుంభమేళాకు వెళ్లిన వారు అయోధ్యకు సైతం వెళ్లి బాల రాముడిని దర్శించుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలోని బాలరాముడి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ఎక్కువైంది. అయితే అయోధ్యకు వెళ్లే భక్తులు తెలుసుకోవాల్సిన విసయం ఒకటుంది. అదేంటంటే.. రోజు రోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అయోధ్య రామమందిర ట్రస్ట్‌ రాములవారి దర్శన వేళలను గంటన్నర పొడిగించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులే స్వయంగా ప్రకటించారు.

సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. కానీ భక్తుల రద్దీ కారణంగా ఇకపై గంట ముందుగా అంటే ఉదయం 6 గంటల నుంచే కల్పిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. రాత్రి 9.30 గంటల వరకూ ఉన్న దర్శన వేళలను 10 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. జనవరి 14 నుంచి బసంత్ పంచమి వరకూ అంటే ఫిబ్రవరి 3 వరకూ అయోధ్య రామయ్యను 50 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. దర్శన వేళలను పెంచడంతో భక్తులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share this post with your friends