అనకాపల్లి జిల్లా ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరాలయంలో సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ఏకాదశి కల్యాణాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ కల్యాణాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన పెరుమాళ్‌కు పల్లకీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధ్వజారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7.40 నుండి 11.30 గంటల వరకు ఎదురు సన్నాహ మహోత్సవం ( కన్యావరుణ సంవాదం) నిర్వహించారు. ఇందులో శ్రీవారు గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు శేష తల్ప వాహనంపై భక్తులను కటాక్షించారు.
నేటి ఉదయం మంగళవారం తెల్లవారుజామున 12.30 (సోమవారం అర్థరాత్రి) నుండి ఉదయం 3.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన ఉపమక పరిసర ప్రాంతాల భక్తులు భక్తి పరవశంతో పులకించారు.