
ఎందుకోగానీ ఎన్నడూ లేనిది.. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం.. అమ్మవారి ఆభరణాలు భద్రమేనా? అనే సందేహం తలెత్తడమే. అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న బంగారు, వెండి వస్తువుల విషయంలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తుండటమే. ఇప్పుడింత సడెన్‌గా సందేహం ఎందుకు వచ్చిందంటారా? దాదాపు ఒక నెల క్రితం ఓ భక్తుడు భద్రకాళి అమ్మవారికి 13 గ్రాముల బంగారు గొలుసును బహూకరించాడు. వాస్తవానికి దానిని స్వీకరించిన ఆలయ అధికారులు తొలుత బంగారు గొలుసు తూకం వేస్తారు. అనంతరం దానిని దేవస్థానానికి చెందిన ఆభరణాల పుస్తకంలో నమోదు చేస్తారు.
ఇవన్నీ పూర్తైన మీదట దాతకు రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం విషయాన్ని కార్యనిర్వాహణాధికారి దృష్టికి తీసుకెళ్లాలి. అయితే ఇవేమీ జరగలేదు. పైగా ఓ ప్రైవేటు వ్యక్తి ఇంటికి ఈ గొలుసు చేరినట్టు వెలుగులోకి రావడంతో భద్రకాళి అమ్మవారి ఆలయం హాట్ టాపిక్‌గా మారింది. శనివారం రాత్రి జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులు గట్టిగా నిలదీశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. బంగారు గొలుసును దేవస్థానం ఉద్యోగులకు అప్పగించినట్టుగా సదరు ఉద్యోగి చెప్పగా తన దృష్టికి తీసుకురాకపోవడంపై ఆలయ ఈవో ఫైర్ అయ్యారు. స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి సైతం ధర్మకర్తలు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
