
పంచభూత లింగాలలో నాలుగు తమిళనాడులోనూ.. ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉందని చెబుతారు. ముఖ్యంగా కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనదని నమ్మకం. కార్తిక మాసం, శివరాత్రి పర్వదినాల్లో భక్తులు శివకేశవులను పూజిస్తూ ఉంటారు. అలాగే శివాలయానికి వెళుతుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ప్రత్యేకంగా పంచ శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటినే పంచారామాలుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ పంచారామాల్లో ఒక క్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనికి కారణమేంటంటే.. అక్కడి శివలింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించాడట.
కుమారస్వామి స్వయంగా ప్రతిష్టించిన పంచారామ క్షేత్రాన్ని కుమార భీమేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉంది. ఇక్కడ 14 అడుగుల ఎత్తులో రెండు అంతస్తులలో తెల్లని స్ఫటిక లింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని కుమార రామం అని పిలుస్తారు. క్రీస్తు శకం 892 – 922 మధ్య ప్రాంతంలో చాళుక్య రాజు అయిన భీముడు ఈ ఆలయ నిర్మాణం గావించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. చాళుక్య భీముడు నిర్మించాడు కాబట్టి ఈ ఆలయం భీమేశ్వరాలయంగా పిలవబడుతోంది. 1340 – 1466 మధ్య కాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.
