కార్తీక మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన మాసమని చెబుతారు. కాబట్టి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత మరే మాసానికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మాసం ఆధ్యాత్మిక సాధనతో పాటు మోక్ష సాధనకు విశిష్టమైనదని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలోనే ఈ మాసమంతా కూడా ఇంటి ముందు దీపారాధన చేస్తుంటారు. అలాగే ఈ మాసమంతా మాంసాహారం మానేసి.. ఒకపూట మాత్రమే తినేవారున్నారు. దేవాలయాల్లో ఇంటి గుమ్మం ముందు రకరకాల దీపాలు వెలిగిస్తుంటారు.
ఈ మాసంలో దీపారాధన రకరకాలుగా చేస్తారు. వాటిలో నారికేళ దీపం ఒకటి. కార్తిక మాసంలో నారికేళ దీపం వెలిగిస్తే.. శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం. అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మరి నారికేళ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలో తెలుసుకుందాం. నారికేళ దీపాన్ని ప్రదోష కాలంలో అంటే సాయం కాలం వేళ వెలిగించాలట. అది కూడా మన ఇంట్లోని పూజ గదిలో వెలిగించాలి. ఇలా కార్తీక సోమవారం నాడు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నారికేళ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలను, దీపం చుట్టూ ఉన్న పూలు, అక్షతలను ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలట.