విష్ణు కమలాల నోము

కథ
ఒక రాజు కూతురూ, మంత్రి కూతురూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయినప్పటికీ మంత్రికూతురు ముఖంలో ఉండే కళాకాంతులు, తన ముఖంలో లేనందుకుగాను రాజు కూతురు ఎంతగానో బెంగపడుతూండేది.

ఈ విషయాన్ని రాకుమారి ఒక బ్రాహ్మణ ముత్తయిదువకు చెప్పుకోగా, విప్ర గృహిణి “రాజకుమారీ!దిగులు పడవలసిన పనేలేదు. స్త్రీల వదనాలకు లక్ష్మి వంటి కళాకాంతులు కలిగేందుకుగాను శ్రీ మహావిష్ణువు ఒక వ్రతం చెప్పాడు. “విష్ణు కమలాలు” అనే పేరుగల ఆ నోమును పడితే నీ ముఖం లక్ష్మీ కళతో వెలిగిపోతుం” దని సలహానిచ్చింది. ఆ విధంగా రాకుమార్తె విష్ణు కమలాల నోము నోచి ఉద్యాపన చేసుకోగా ఆమె వదనం లక్ష్మీ కళతో ప్రకాశించింది.

విధానం
ప్రతి రోజు ఒక కమలవత్తిని ఆవునేతితో వెలిగించి, లక్ష్మీ నారాయణులను పూజించి పై కథను చెప్పుకుని అక్షితలు వేసుకోవాలి. సంవత్సరాంతాన ఉద్యాపనం చేసుకోవాలి.

ఉద్యాపనం
సంవత్సరాంతాన ఒక వెండి ప్రమిదనూ, ఒక బంగారు ప్రమిదనూ చేయించి, రెండింటా ఆవు నేతితో చెరొక కమలవత్తినీ వెలిగించాలి. లక్ష నారాయణులను పూజించి, ఒక మానెడు సోలేడు బియ్యం, క్రొత్త వస్త్రం, దక్షిత తాంబూలాలతో వెలుగుతున్నవెండీ, బంగారు ప్రమిదలతో సహా దీపాల్ని వాయనదానమివ్వాలి.

Share this post with your friends