శ్రీకృష్ణుడు వివరించిన పవిత్ర ఏకాదశి వ్రత మహిమ..

పవిత్ర ఏకాదశీ మహిమను శ్రీకృష్ణధర్మరాజ సంవాదరూపంలో భవిషోత్తర పురాణంలో వర్ణించబడింది. శ్రావణమాసంలోని ఏకాదశి పేరును, దాని మాహాత్మ్యాన్ని వివరించమని ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు. ఆ ఏకాదశి పేరు పవిత్ర ఏకాదశియని, మనిషియొక్క సమస్త పాపాలను నశింపజేసే ఆ ఏకాదశిని గురించి శ్రద్ధగా వినుమని, ఆ ఏకాదశీ మహిమను వినడం చేత వాజపేయ యజ్ఞం చేసినంత ఫలం కల్గుతుందని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చి ఆ వివరాలను ఇలా తెలుప నారంభించాడు. “ద్వాపరయుగారంభంలో మాహిష్ణుతీపురమనెడి రాజ్యాన్ని మహీజిత్తు అనేది రాజు పాలించేవాడు. సంతానం లేకపోవడం వలన కార్యనిర్వహణలో అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉండేవాడు. సంతానవిహీనుడైనవానికి ఇహపరాలలో సుఖం లేదు కదా! ఎన్ని సంవత్సరాలైనప్పటికిని ఆనందాన్ని కలిగించే పుత్రరత్నమే అతనికి కలుగలేదు” అని చెప్పాడు.

తన దీనపరిస్థితిని గమనించిన రాజు ఒకరోజు తన కన్నబిడ్డలుగా చూసుకునే రాజ్యప్రజలను సభకు పిలిపించి ఇలా అన్నాడు. “ప్రజలారా! ఈ జన్మలో నేనెలాంటి పాపం చేయలేదు. అధర్మయుతమైన ధనంతో ఖజానాను నింపలేదు. బ్రాహ్మణుల సంపత్తిని దేవతల సంపదను కొల్లగొట్టలేదు. పైగా యథావిధిగా ఈ ప్రపంచాన్ని జయించాను. మిమ్మల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాను. తప్పు చేసియుంటే సోదరుడు, బంధువుల వంటి వారినికూడ దండించుటలో వెనుకాడలేదు. సౌమ్యుడు, పుణ్యాక్షుడు అయితే శత్రువుకైనను నేను గౌరవమిచ్చెదను. ఓ బ్రాహ్మణులారా! ఈ ప్రకారంగా ధర్మమార్గంలో నడిచినప్పటికిని నేను పుత్రహీనుడనయ్యాను. దీనికి కారణమేమిటో నాకు తెలపండి” అన్నాడు.

“రాజు దీనాలాపములను వినిన బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని తమ రాజు నిమిత్తమై భూతభవిష్యద్వర్తమానముల ఎరిగిన ఋషులను కలవడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అరణ్యానికి వెళ్ళి అటుఇటు తిరుగుతూ వారు అనేక ఆశ్రమాలను సందర్శించారు. చివరకు వారు లోమశమునిని కలిసికొన్నారు. ఆయన కఠోరతపస్సులో ఉన్నాడు. ఆయన దేహం దివ్యంగాను, ఆనందమయంగాను ఉంది. ఆయన ఉపవాసవ్రతంలో ఉన్నాడు. ఆత్మనిగ్రహుడైన ఆ ముని సర్వజ్ఞానసంపన్నుడు. బ్రహ్మదేవుని ఆయువంత ఆయుర్దాయం కలవాడు, తేజోమయుడు అయియున్నాడు. బ్రహ్మదేవుని ఒక కల్పం గడచిపోగానే ఆ ముని దేహం నుండి ఒక రోమం (లోమము) క్రిందపడుతుంది. అందుకే ఆ మునికి లోమశముని అనే పేరు వచ్చింది. ఆయనకు భూతభవిష్యద్వర్తమానములు తెలుసు”.

ఆ ముని తేజస్సుచే మోహితులైనవారై బ్రాహ్మణులు ఆయన చెంతకు వెళ్ళి వినమ్రంగా స్తోత్రం చేశారు. అది వినిన ఆ ముని వారెవరని, తననెందులకు స్తుతిస్తున్నారని అడిగాడు. అపుడు ప్రత్యుత్తరంగా బ్రాహ్మణులు ఆయనతో “మునివర్యా! సందేహనివృత్తి కొరకే మీ చెంతకు వచ్చాము. మా రాజైన మహీజిత్తునకు సంతానం కలుగలేదు. ప్రజలమైన మమ్ము రాజు కన్నబిడ్డలలాగా చూసుకుంటున్నాడు. అందువలన రాజు కష్టాన్ని చూసి మేము భరించలేకపోయాము. భాగ్యవశాత్తు మేము నేడు మిమ్ములను చూడగలిగాం. మహనీయుడైన వ్యక్తి దర్శనమాత్రం చేతనే పురుషుడు సకలాభీష్టాలను పొందగలుగుతాడు. పుత్రహీనుడైన మా రాజు పుత్రవరదుడు అయ్యే మార్గాన్ని బోధించండి” అని విన్నపం చేసుకొన్నారు. వారి ప్రార్థనలను వినిన లోమశముని వెంటనే ధ్యానమగ్నుడై మహీజిత్తు యొక్క పూర్వజన్మను గురించి తెలిసికొన్నాడు. మహీజిత్తు తన పూర్వజన్మలో ఒక వైశ్యుడు. ఆ జన్మలో అతడు ఒక పాపకార్యం చేశాడు. వ్యాపారార్థం అతడు ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి వెళుతూ దారిలో దప్పికకు గురైనాడు. అది ద్వాదశి మధ్యాహ్న సమయం. దగ్గరలో అతనికి ఒక మంచినీళ్ళ కొలను కనిపించింది: దానిలో అతడు నీళ్ళను త్రాగాలనుకున్నాడు. అప్పుడే ఒక ఆవు, అప్పుడే పుట్టిన తన బేగతో పాటు నీళ్ళు త్రాగడానికి అక్కడకు వచ్చింది. కాని ఆ వైశ్యుడు ఆవును దూరంగా తరిమివేసి తానే మంచినీళ్ళను తాగాడు. దప్పిక గొనిన అవును నీళ్ళు తాగకుండ ఆపినందులకు అతనికి పాపం అంటింది. ఆ కారణంగా రాజు ప్రస్తుత జన్మలో పుత్రహీనుడయ్యాడు”.

అది వినిన బ్రాహ్మణులు పుణ్యంతో పాపాన్ని పరిహరించవచ్చునని రాజు పాపం తొలగి పుత్రవంతుడు అయ్యే పద్ధతిని ఉపదేశించమని మునిని ప్రార్ధించారు. అప్పుడు లోమశముని వారితో “శ్రావణమాసంలోని శుక్లపక్షములో వచ్చే సుప్రసిద్ధ ఏకాదశి పవిత్ర ఏకాదశి. మీరు, మీ రాజు ఆ ఏకాదశిని యథావిధిగా ఆచరించండి. తరువాత ఆ ఏకాదశి వ్రతపాలన కలిగిన పుణ్యాన్ని మీరు మీ రాజుకు ధారపోయండి, మీరు నా ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రాజు పుత్రవంతుడౌతాడు” అని అన్నాడు. ముని మాటలను వినిన బ్రాహ్మణులు ఆనందించారు. సంతోషించారు. తరువాత తమ రాజ్యానికి తిరిగి వెళ్ళి లోమశముని చెప్పినదంతా ఆయనకు పూసగుచ్చినట్లు చెప్పారు. తరువాత సరైన సమయం రాగానే రాజు సలహాదారులైన బ్రాహ్మణులు ముని ఉపదేశాన్ని గుర్తు చేసికొని రాజుతోపాటు పవిత్ర ఏకాదశిని యథావిధిగా పాటించారు. ద్వాదశిరోజు వారు తమ పుణ్యాన్ని రాజుకు ధారపోశారు. ఆ పుణ్యఫలంగా రాణి గర్భవతియై అందమైన పుత్రుని కన్నది. “ధర్మరాజా! ఈ పవిత్ర ఏకాదశిని పాటించేవాడు సమస్త పాపాల నుండి బయటపడి ఇహపరాలలో సుఖాన్ని పొందుతాడు. ఈ ఏకాదశి మహిమను వినేవాదు ఈ జన్మలో పుత్రప్రాప్తి ఆనందాన్ని అనుభవించి తదనంతరం భగవద్దామానికి చేరుకుంటాడు” అని శ్రీకృష్ణుడు తెలిపాడు.

Share this post with your friends