
మెదక్ జిల్లాలో నిజాంసాగర్ వెనుక కొప్పోలులో ఉన్న ఉమాసంగమేశ్వర ఆలయం మిస్టరీ ఏంటో తెలుసుకున్నాం. ఇక్కడి శివయ్యను అభిషేకించిన జలం కంటికి కనిపించకుండా మాయమవుతుంది. వెలుపలికి వెళ్లేందుకు సైతం మార్గం లేదు. శాస్త్రవేత్తలకే అంతు చిక్కని మిస్టరీ ఇది. ఇదొక్కటే అద్భుతం కాదిక్కడ. ఎన్నో అద్భుతాలకు ఈ ఆలయం నెలవు. ఇదొక గుహాలయం అని ముందే చెప్పుకున్నాం కదా. చిన్న గుట్ట మీద శివుడు స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. సంగమేశ్వర ఆలయ స్థల పురాణం ఏంటంటే.. సుమారు 50 సంవత్సరాల క్రితం కొప్పోలు ఉన్న ప్రాంతమంతా దట్టమైన అడవిలాగా ఉండేది.
ఆ సమయంలో కర్ణాటకలోని బసవకళ్యాణ పీఠాధిపతి శ్రీ మదనానంద సరస్వతి స్వామి ఇక్కడకు వచ్చి కొంతకాలం పాటు ఈ ఆలయం ప్రాంతంలో తపస్సు చేసుకున్నారట. ఆ సమయంలో ఈ ఆలయాభివృద్ధికి ఆయన ఎంతగానో పాటుపడ్డారని చెబుతారు.
ఉమా సంగమేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా జరుగుతాయి. ఇక శివయ్యకు ఇష్టమైన సోమవారం అయితే స్వామివారిని పంచామృతాలతో అభిషేకిస్తారు. అలాగే మాస శివరాత్రి అనేది నెలకోసారి వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక మాసమైన కార్తీకంలోనూ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. మహా శివరాత్రి అయితే ఇక్కడ కన్నుల పండువగా జరుగుతుంది. దీనిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు.
