కాకతీయుల శిల్పకళా వైభవానికి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి శివాలయమే తార్కాణం. ఎటువంటి ఆధునిక నిర్మాణ పరికరాలు లేని ఆ రోజుల్లో ఇంతటి గొప్ప నిర్మాణం చేసిన ఖ్యాతి కాకతీయులకు దక్కుతుంది. గర్భాలయంలో ప్రతిష్టించిన శివలింగం సైతం వారి శిల్ప కళా వైభవానికి అద్దం పడుతోంది. ఇక్కడి గర్భాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుదీరాడు. ఇక ఇక్కడ ఇతర ఉపాయాలు సైతం ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారిడా ఉపాలయాలున్నాయి. ఇక్కడ క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు కొలువుదీరాడు.

చుట్టూ కొండలు, ప్రకృతి సౌందర్యం మధ్య ఈ ఆలయం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతూ ఉంటుంది. ఈ ఆలయం ఆధ్యాత్మికంగానే కాదు.. చారిత్రక పర్యాటక ప్రదేశంగా కూడా ఆ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచింది. శివుడికి ఇష్టమైన సోమవారం నాడు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ప్రధాన పండుగ మహాశివరాత్రి. ఈ పండుగ నాడు ఇక్కడ విశేష పూజలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక శివుడికి అత్యంత ఇష్టమైన కార్తిక మాసంలో అయితే నెల రోజుల పాటు ఆలయంలో దీపోత్సవాలు జరుగుతాయి. ఒక్క దర్శనంతో కొండంత ఆపదలను కూడా తొలగించే దేవునిగా గణపేశ్వరుడు ఇక్కడ భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
