హిందువులు తమ ఇంట ఏ శుభకార్యం జరిగినా.. ఏ పని మొదలు పెట్టినా.. ఏ పూజ ఆరంభించినా ముందుగా పూజించేది వినాయకుడినే. సర్వ విఘ్నాలు తొలగించే గణనాథుడు ఒకచోట సిద్ధి వినాయకుడిగానూ.. మరో చోట లక్ష్మీ గణపతిగానూ.. ఇంకోచోట లంబోదరుడిగానూ పూజలందుకుంటున్నాడు. పేర్లు ఏవైతేనేం రూపం మాత్రం ఒక్కటే. తెలంగాణలోనూ ఎన్నో చోట్ల గణనాథుడి ఆలయాలున్నాయి. వాటిలో ముఖ్యంగా గణపతి స్వయంభువుగా వెలిశాడు. వీటిలో కొన్ని క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి. కాబట్టి అవి నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ప్రసిద్ధి చెందిన గణనాథుని స్వయంభువు క్షేత్రమే చింతలు తీర్చే రేజింతల్ సిద్ది వినాయకుడు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో రేజింతల్ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో గణనాథుడు దక్షిణాభిముఖంగా కొలువుదీరి దర్శనమిస్తాడు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి వినాయకుడి విగ్రహమంతా సింధూరంతో నిండి ఉంటుంది. సింధూర గణపతిని పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని గణేశ పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి రెండు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వయంభువుగా వెలసిన ఈ స్వామి విగ్రహం ఏటా నువ్వు గింజంత పరిమాణంలో పెరుగుతుందని చెబుతారు. ఇక్కడ గణపతిని దర్శించుకొని ఆలయంలో ముడుపు కడితే వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. సంగారెడ్డి, జహీరాబాద్ నుంచి రేజింతల్‌కు రవాణా సౌకర్యం ఉంది.
