‘కాశీ’ ఈ పేరు వింటే మనసు ఆధ్యాత్మిక భావనలోకి వెళుతుంది. జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్లాలని కోరుకోని వారు ఉండరు. కొందరు జీవిత చరమాంకంలో ఉన్నవారు మరణించడం కోసమే కాశీకి వెళతారు. భారతదేశ సాంస్కృతిక రాజధానిగా వారణాసిని పేర్కొంటారు. భారతదేశంలోని అత్యంత సుందరమైన నగరాలలో ఒకటిగా వారణాసి ప్రసిద్ధి గాంచింది. అంతేకాకుండా కాశీ అనేది అత్యధిక సంఖ్యలో దేవాలయాలకు నిలయంగా కూడా పేరుగాంచింది. కాశీ నగరంలో ప్రతి వీధిలో ఒక దేవాలయం ఉంటుంది. ప్రతి దేవాలయం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.

అలాగే కాశీలో ఏ నోటా విన్నా శివ నామ స్మరణమే ధ్వనిస్తూ ఉంటుంది. కాశీ నగరంలో కాశీ విశ్వనాథుని ఆలయంతో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో తిలబందేశ్వర్ ఆలయం అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. వారణాసిలోని తిలబందేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది. ఇది ఈనాటిది కాదు. ఇక్కడి తిలబందేశ్వర్ 2000 సంవత్సరాల కిందట స్వయంభువుగా వెలసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ తిలబందేశ్వర్ ప్రత్యేకత ఏంటంటే.. ఈ శివలింగం పరిమాణం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. శివపురాణంలో కూడా ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది.
