తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన కుండలేశ్వర స్వామి వెలిశాడు. సముద్రుడు బహూకరించిన రెండవ కుండలం మానవులు సేవించుకోవటానికి అనువుగా కుండలేశ్వరునిగా భూమి మీద వెలసి ఉన్నాడు. కుండలేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో శివుడు.. శివలింగంగా స్వయంభువుగా వెలిశాడు. ఈ శివలింగం కుండలం ఆకారంలో ఉంటుంది కాబట్టి దేవాలయ గోపురం మీద వివిధ శివ రూపాలు, శివలీలలు చెక్కి ఉంటాయి. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు సైతం ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఉత్తరాన చండీశ్వరుడు, ఈశాన్యం మూల కాలభైరవుని ఆలయాన్ని సైతం దర్శించుకోవచ్చు.

ఆలయ ప్రాకారంలో దుర్గమ్మ వన దుర్గగా వెలసి ఉంది. అలాగే ఆలయ ప్రాంగణంలో కుడి పక్కన చిన్న ఉపాలయం ఉంటుంది. క్షేత్ర పాలకుడైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి.. దక్షిణామూర్తి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉపాలయాలు సైతం ఉంటాయి. శివయ్య దర్శనానికి వచ్చిన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా అభయముద్రలో ఆంజనేయ స్వామివారు కొలువుదీరాడు. ఇక్కడి కుండలేవ్వరునికి త్రికాల పూజలు, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం శివునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. మహాశివరాత్రి, హనమజ్జయంతి పండుగలు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి కుండలేశ్వరుడిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం.
