తమిళనాడు తిరువారూర్ జిల్లాలోని తిరుక్కొళ్లికాడులో కొలువుదీరిన శనీశ్వరుడు అత్యంత మహిమ కలవాడని అంటారు. ఇక్కడి శనీశ్వరుడిని పొంగు శనీశ్వరుడిగా పేర్కొంటారు. అవడానికి ఇది శని దేవాలయమైనప్పటికీ మూలమూర్తిగా ఇక్కడ పరమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. వందల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అగ్నీశ్వరర్ ఆలయంగా కూడా పిలుస్తారు. తిరువారూర్ పొంగు శనీశ్వర దేవాలయాన్ని చోళ రాజులు నిర్మించినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. పూర్వం నల మహారాజు ఈ ఆలయాన్ని దర్శించుకున్నాడని చెబుతారు.

నల మహారాజును ఏలిన నాటి శని కారణంలో ఎన్నో బాధలు అనుభవించాడట. ఆ సమయంలో నలుడు శని, ఈశ్వరులను పూజించడం వలన శని బాధల నుంచి ఉపశమనం పొందినట్లుగా ఆలయ చరిత్ర ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఆలయంలోని శనీశ్వరుడు తన వాహనమైన కాకితో దర్శనమిస్తాడు. ఒక చేతిలో నాగలి ధరించి మరో చేయి తనను దర్శించుకున్న భక్తులకు అభయమిస్తున్నట్టుగా ఉంటుంది. ఆలయంలో మహాలక్ష్మి సన్నిధికి సమీపంలో ఉన్న కుబేర స్థలంలో పొంగు శనీశ్వరుడు కొలువుదీరాడు. ఈ శనీశ్వరుడిని దర్శిస్తే శని దోషాలు తొలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధించి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని విశ్వాసం.
