కాశీలోని తిలబందేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కొన్ని ఉపాలయాలు సైతం ఉన్నాయి. వినాయకుడు, గౌరీ దేవి, కాళికామాత, ఆంజనేయస్వామి ఉపాలయాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో శారదా మాత ఎన్నో రోజుల పాటు ధ్యానం చేశారట. అలాగే నడిచే దైవంగా ఖ్యాతి చెందిన జగద్గురువులు ఆదిశంకరులు సైతం కాశీని సందర్శించారట. ఆ సమయంలో ఈ తిల బందేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో ఈ క్షేత్రం ఉండటం వలన నిత్యం ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

ఉత్తరాది వారంతా పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి సోమవారం మహాదేవ్ కు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మహా శివరాత్రి ఇక్కడ ప్రధాన పండుగ. ప్రతిరోజూ ఉదయం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిల బందేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించి, పూజించడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు జరుగుతాయని.. అలాగే గతంలో ఉన్న సమస్యలు తొలగి కొత్త జీవితానికి నాంది పలుకుతారట. ఈ ఆలయం బనారస్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి 5 కి.మీ దూరంలో, విశ్వనాథుని ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఆటోలు నిత్యం అందుబాటులో ఉంటాయి.
