కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో తుంగభద్రా నదికి ఇటువైపు మంత్రాలయం.. మరోవైపు పంచముఖ ఆంజనేయుడు కొలువుదీరాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా, గణధాల్ (గణదల్) గ్రామంలో ఉంటుంది. పంచముఖ అంటే ఐదు ముఖాలు కలవాడు అని అర్ధం. పంచముఖ ఆంజనేయస్వామి క్షేత్రాలు మన దేశంలో పెద్దగా లేవు. ఇక పంచముఖి గ్రామంలోని ఆంజనేయ స్వామి క్షేత్రం విశేషాల గురించి తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయుని ఆలయంలో కొన్ని ఆకృతులు సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. అక్కడి రాతిపై స్వయంభువుగా హనుమంతుడు ప్రకటితుడయ్యాడు. ఇక్కడి హనుమ స్వరూపం మనల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది.

ఇక్కడి గుహలో ఏర్పడిన సహజసిద్ధ ఆకారాలేంటంటే.. మంచం తలగడ, విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడి ఆంజనేయస్వామి.. నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుల రూపాన్ని కలగలుపుకుని దర్శనమిస్తాడు. ఇక హనుమంతుడు పది ఆయుధాలతో భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. పంచభూతాలను తనలో ఇముడ్చుకున్న ఈ స్వామివారు భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ క్షేత్రానికి ముఖ్యంగా మంగళ, శనివారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. ఇక హనుమజ్జయంతికి ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి శిష్యులైన అనంతాచార్యులు, రుద్ర దేవుడు, గణపతి, నాడేవుని విగ్రహాలను సైతం మనం వీక్షించవచ్చు.
