సీతారాముల ఆలయం లేని ఊరంటూ ఉండదు. భారతీయుల హృదయాలలో సీతారాములు అత్యున్నత స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే సీతారాములను నిత్యం భక్తులు పూజించుకంటున్నారు. సీతారాములు ప్రతి ఊరిలో కొలువై ఉన్నా కూడా.. ప్రసిద్ధి గాంచిన క్షేత్రాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిలో శ్రీరాముడు ప్రత్యక్షంగా నడయాడినవి కూడా ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. మరి ఆ పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? తెలుసుకుందాం. త్రేతాయుగంలో జరిగిన రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ప్రదేశాలు నేటికీ మన దేశంలో పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. వాటిలో మొదట చెప్పుకోదగినది అయోధ్య.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సరయూ నది ఒడ్డున ఉన్న అత్యంత పురాతనమైన, పవిత్రమైన హిందూ క్షేత్రమే అయోధ్య. ఇది శ్రీరాముని జన్మస్థలంగా విరాజిల్లుతోంది. రామ జన్మభూమి కావడంతో ఈ క్షేత్రాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ఈ క్షేత్రం శ్రీరాముని జన్మస్థలం, రామ జన్మభూమి అని విశ్వాసం. కొన్ని శతాబ్దాల పాటు అయోధ్య ఆక్రమణలకు గురైంది. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత తిరిగి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న భారీ రామ మందిరం రూపు దిద్దుకుంది. ఇది కొన్ని శతాబ్దాల హిందువుల కల. అయోధ్య మందిరంలో శ్రీరాముడు బాల రాముడిగా, రామ్ లల్లాగా పూజలందుకుంటున్నాడు. సప్త మోక్షపురులలో అయోధ్యను మొదటిదిగా చెబుతారు.
