వినాయకుడు ఒక్కోచోట ఒక్కోలా కొలువుదీరాడు. ఒకచోట ఐశ్వర్య గణపతిగా.. మరోచోట శ్వేతార్క గణపతిగా కొలువుదీరాడు. మరి భాగ్యాలు పంచే గణపతి కూడా ఉన్నాడని తెలుసా? ఈ వినాయకుడు ఎక్కడ కొలువుదీరాడో తెలుసుకుందాం. భాగ్య నగరంలో భాగ్యాలు ప్రసాదించే లష్కర్ గణపతి కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటాడు. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్ సమీపంలో సిద్ధివినాయకుడి గుడి ఉంటుంది. ఇది భాగ్యనగర వాసులందరికీ బాగా తెలుసు. ఈ వినాయకుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచాడు. రెండు శతాబ్దాల కిందట ఇప్పుడు ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక బావి ఉండేదట.

ఆ బావిలో ఈ వినాయకుడి విగ్రహం దొరికిందని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. నాటి నుంచి లష్కర్ గణపతికి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ స్వామివారు సిద్ధి వినాయకుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఉప ఆలయాలు సైతం ఉన్నాయి. శివుడు, అమ్మవారు, వేంకటేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయుడు, శనీశ్వరుడు, రాహు-కేతు ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడకు వచ్చి భక్తులు స్వామివారిని కొంగుచాచి అడగాలే కానీ తీరని కోరికంటూ ఉండదని అంటారు. ఇక వినాయకచవితి వచ్చిందంటే ఇక్కడ పెద్ద ఎత్తున గణేశ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే సంకటహర చతుర్థిని ఘనంగా జరుపుతారు.
