ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి. అలాంటి ఆంజనేయుడు ఓ చోట మాత్రం స్త్రీ రూపంలో దర్శనమిస్తాడు. ఆలయ అర్చకులు స్వామివారిని స్త్రీ మూర్తిగా అలంకరిస్తారు. అందుకే ఈ హనుమంతుడిని మాతా హనుమాన్‌గా పిలుస్తారు. ఈ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని రత్నపూర్లో ఉంది. దీనిని గిరిజాబంధ్ హనుమాన్ క్షేత్రంగా పిలుస్తారు. స్వామివారు స్త్రీ రూపంలో భక్తులకు దర్శనమివ్వడం వెనుక ఓ చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పృథ్విదేవ్‌జు అనే రాజు పాలించేవాడు. ఆయన కుష్ఠువ్యాధి బాధితుడు. స్వస్థత కోసం ఆంజనేయుడిని పూజించగా.. ఒకరోజు కలలో కనిపించి తన విగ్రహం ఉన్న ప్రాంతం ఉనికిని తెలియజేసి దేవాలయాన్ని నిర్మించమన్నాడట. రాజు తన సైన్యంతో వెళ్లి వెతికితే స్త్రీరూపంలో ఉన్న వానరవీరుడి మూర్తి కనిపించింది. వెంటనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. నేటికీ స్వామివారు స్త్రీ రూపంలోనే దర్శనమిస్తున్నాడు. మూలమూర్తికి ముక్కుపుడక, కుంకుమ, కొంగు వంటి అలంకరణలన్నీ చేసి శక్తిస్వరూపిణిగా కొలుస్తారు. స్వామివారి భుజాలపైన రామలక్ష్మణులు ఉంటారు.

ఈ ఆంజనేయుడు ఆరు అంగుళాలే..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ జన్మభూమికి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో హనుమంతుడు కొలువుదీరాడు. దీనిని హనుమాన్ గఢీ మందిర్‌గా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు ఆరు అంగుళాల బాలుడిగా, తల్లి అంజనాదేవితో కలిసి దర్శనమిస్తాడు. అయోధ్యకు రక్షకుడిగా కూడా ఈ స్వామినే భావిస్తారు. ఈ బాల హనుమంతుడిని పూజించాకే అయోధ్యలో శ్రీరాముడిని భక్తులు దర్శించుకుంటారు.
